పుష్ప 2: ది రూల్ – ఫైర్ నుండి వైల్డ్ ఫైర్ గురించి ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా విడుదలైన పుష్ప 2 ట్రైలర్ ఈ ఉత్సాహాన్ని మరింత పెంచింది. గత చిత్రం పుష్ప: ది రైస్ విజయాన్ని ఆధారంగా చేసుకొని, పుష్ప 2 ఈ సిరీస్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇది కేవలం ఓ సినిమా మాత్రమే కాదు, తెలుగు సినిమా గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించే ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు.

సినిమాకు మించి సంస్కృతిగా మారిన పుష్ప
పుష్ప 2 కేవలం సినిమా మాత్రమే కాదు; ఇది సంస్కృతిలో మార్పు తీసుకువచ్చిన ఒక ఉద్యమంగా మారింది. పుష్ప క్యారెక్టర్‌ను సెలబ్రిటీలు మాత్రమే కాక, సాధారణ ప్రజలు కూడా అనుకరించడం ద్వారా, ఈ సినిమా పట్ల ఆసక్తిని విస్తృతంగా పెంచారు. ఇది పుష్ప సిరీస్ సాధించిన ఘనత అని స్పష్టం చేస్తుంది.పుష్ప 2 ట్రైలర్ ప్రేక్షకులను కట్టిపడేసే విధంగా ఉంది. పుష్ప 1 ప్రధానంగా తెలుగు మరియు ఉత్తర భారత ప్రేక్షకుల మదిలో నిలిచినా, పుష్ప 2 భారతదేశం అంతటా మరియు విదేశాలలో కూడా విస్తృత శ్రద్ధను పొందింది. ఆ విధంగా ఈ సారి అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రేక్షకులని ఆకట్టుకునే అవకాశం ఉంది.
ఫ్యాన్స్ హంగామా మరియు బాలీవుడ్‌పై ప్రభావం
బీహార్‌లోని పాట్నాలో జరిగిన ట్రైలర్ లాంచ్ వేడుకలో లక్షలాది మంది ప్రేక్షకులు హాజరుకావడం, చెన్నై, కొచ్చి మరియు ముంబయిలో జరిగిన పుష్ప 2 ప్రొమోషన్స్ వేడుకలలో లభించిన విశేష స్పందన ఈ పుష్ప సిరీస్ దేశవ్యాప్తంగా సాధించిన గుర్తింపును తెలియజేస్తుంది. ఈ సీరీస్ ప్రేక్షకుల్ని దక్షిణాది రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఉత్తరాదిన కూడా ఆకర్షించగలిగింది. ఇది భారతీయ సినిమాపై గుత్తాధిపత్యం చూపిస్తున్న బాలీవుడ్ ను సవాల్ చేస్తూ తెలుగు సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లింది.
ట్రైలర్‌లోని “ఫైర్ నుండి వైల్డ్ ఫైర్” అనే డైలాగ్, పుష్ప క్యారెక్టర్ పరిణామాన్ని అద్భుతంగా వివరించింది. ఇది ప్రేక్షకుల్లో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
సంస్కృతీ సారాన్ని జోడించిన పుష్ప
ట్రైలర్‌లో పుష్ప కొత్త అవతారం ఆహ్లాదకరంగా ఉంది. తన సాంప్రదాయిక వస్త్రాలు మరియు ప్రత్యేకమైన మేకప్, తిరుపతి గంగమ్మ జాతరను గుర్తు చేస్తూ, స్థానిక సంస్కృతికి అనుబంధాన్ని కల్పించాయి. ఇది కేవలం విజువల్‌గా ఆకట్టుకోవడమే కాకుండా, కథనాన్ని మరింత లోతుగా చూపిస్తుంది.
చిత్తూరు జిల్లా భాషలో పుష్ప మాటల తీరూ, ఎర్రచందనం అక్రమ రవాణా వ్యాపారంలో ప్రపంచాన్ని శాశించాలన్న తన ఆకాంక్షలూ కథలో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి.

వైవిధ్యమైన సంగీత సమర్పణ
పుష్ప 2 సంగీత విభాగంలో మరో విశేషం జరిగింది. దేవి శ్రీ ప్రసాద్ (డీఎస్పీ) మరియు ఎస్.ఎస్. థమన్ కలిసి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించడం సంగీత ప్రేమికుల్లో ఆసక్తిని రేకెత్తించింది. సినిమా పూర్తి అయ్యే సమయంలో ఉన్నట్టుండి ఎస్.ఎస్. థమన్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంపై సినిమా అభిమానుల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. పుష్ప 1 లోని పాటలు ఇప్పటికీ ప్రాచుర్యం పొందుతూ ఉండగా, ఈ కొత్త అనుబంధం ఈ సినిమాకు అదనపు ఆకర్షణను తెస్తుందా లేకా వివాదాలకు దారి తీస్తుందా అనేది చూడాలి.
“ఊ అంటావా మామా…” అనే పాట పుష్ప 1లో హిట్ అయ్యిన తర్వాత, పుష్ప 2 లో శ్రీలీల మరియు అల్లు అర్జున్ కలిసి నటించిన “కిస్సిక్” అనే ఐటమ్ సాంగ్ ఇప్పటికే జనాల్లో పాపులర్ అయింది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే పుష్ప 1 లో ఉన్న “ఊ అంటావా మామా…” అనే పాట మరియు పుష్ప 2 లో ఉన్న “కిస్సిక్” అనే ఐటమ్ పాట, ఈ రెండు పాటలు కూడా పితృస్వామ్య భావజాలం గురించి స్త్రీ దృక్కోణంలో నొక్కి చెప్పి, శ్రోతలను ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తాయి.
టీజర్ హైప్ మరియు రాజకీయ అంశాలు
ఏడు నెలల క్రితం విడుదలైన “పుష్ప ఎక్కడ?” టీజర్ పుష్ప 2 సీక్వెల్‌కు మలుపు తిప్పింది. పుష్ప ఆచూకీ కోసం జరుగుతున్న గాలింపు చర్యలను పరిచయం చేస్తూ, అభిమానులలో ఆసక్తి మరియు ఊహాగానాలను రేకెత్తించింది. ఈ టీజర్ పుష్ప స్మగ్లింగ్ కార్యకలాపాలు మరియు ఆయన సామాజిక సేవల మధ్య వ్యత్యాసాన్ని చూపించింది, పుష్పను భయపెట్టే వ్యక్తిగా మరియు గౌరవనీయ వ్యక్తిగా ప్రతిఫలించే కాంప్లెక్స్ క్యారెక్టర్‌గా రాసింది. ఈ ద్వంద్వతత్వం నాయకత్వం మరియు పాలన వంటి లోతైన రాజకీయ అంశాలను సూచిస్తూ, సీక్వెల్‌లో అవి ఎలా పరిణమిస్తాయో చూపించబోతున్నాయి.
అభిమానుల యుద్ధాలు మరియు రాజకీయ ఉద్రిక్తతలు
పుష్ప 2 ట్రైలర్ విడుదల మెగా ఫ్యాన్స్ (పవన్ కళ్యాణ్ అభిమానులు) మరియు బన్నీ ఫ్యాన్స్ (అల్లు అర్జున్ అభిమానులు) మధ్య తీవ్రమైన అభిమాని యుద్ధాలకు తెరతీసింది. అల్లు అర్జున్ తన బంధువైన పవన్ కళ్యాణ్‌కు బదులుగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డిని సమర్థించడం అభిమానుల్లో దూమారం రేగింది. ఇది పెద్ద ఎత్తున ట్రోలింగ్ మరియు ఆన్‌లైన్ ఘర్షణలకు దారితీసింది.
అభిమానుల నుంచి వచ్చిన వ్యతిరేకతను లెక్కచేయకుండా, తన స్నేహితుడికి అల్లు అర్జున్ చూపిన నిబద్ధత వైఎస్సార్‌సీపీ అనుచరుల నుంచి విస్తృత మద్దతును సంపాదించింది. ఒకవైపు తనకు మద్దతుగా నిలుస్తున్న అభిమానులకు బన్నీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతుంటే పుష్ప 2 సినిమా గురించి మెగా ఫ్యామిలీలోని మిగతా హీరోల నుండి ఊహించినంత స్పందన రావడంలేదు. ఇది సినిమా ప్రమోషన్లకు ఒక కొత్త రాజకీయ కోణాన్ని జోడించింది.
ఈ అభిమానుల యుద్ధం ఫైర్ నుండి వైల్డ్ ఫైర్‌గా మారి, సినిమాపై ఉత్సాహం మరియు వివాదాలను సృష్టించింది. ఈ భేదాలు ఆంధ్రప్రదేశ్‌లో సినిమా మరియు రాజకీయాల అనుసంధానంపై చర్చలను కొనసాగిస్తూనే ఉన్నాయి.
సామాజిక అంశాలు మరియు టికెట్ ధరలు
పుష్ప 2 ట్రైలర్ విజయంతో, రోజురోజుకూ ఈ సినిమాకు పెరుగుతున్న ఆదరణతో టికెట్ ధరల పెంపుదలపై చర్చ మొదలైంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పుష్ప 2 ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు అమాంతం పెంచేసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్ ధరలు పెంచబోతుంది అని సర్వత్రా వినికిడి. వినోదాన్ని పొందే హక్కు అందరికీ ఉంది. సామాన్యులను దృష్టిలో ఉంచుకోకుండా ఇలా టికెట్ ధరలు పెంచడం తెలుగు సినీ పరిశ్రమకు గానీ, సమాజానికి గానీ మంచిది కాదు. కావున, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంలో ఆచరణాత్మకంగా వ్యవహరిస్తే బాగుంటుంది.

ముగింపు
పుష్ప 2: ది రూల్ ట్రైలర్ అంచనాలను అమాంతం పెంచింది. ప్రేక్షకులను ఆకట్టుకునే కథ, అత్యున్నత విజువల్స్, మరియు అద్భుతమైన నటనతో ఈ చిత్రం తెలుగు సినిమా కీర్తిని ప్రపంచానికి చాటేలా కనిపిస్తోంది. ఈ సినిమా విజయవంతమై, తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచుతుందని ఆశిద్దాం.
Nice Article 👍
పుష్ప 2 సినిమా నేను చూడలేదు కానీ నాకు ఉన్న బయట ప్రజల్లో వినిపిస్తున్న ఒక్క అంశాన్ని మాత్రం ప్రస్తావిస్తాను
వేల కోట్లు పెట్టి సిని నిర్మాతలు సినిమాలు తీయడం ఆ భారం సినిమా చూసే ప్రేక్షకులు నుండి వచ్చే డబ్బులు తగినంత లాభం కావాలనుకుంటే దీనికి రాజకీయాలు కూడా జోడించారు
వాస్తవికంగా వేల కోట్ల రూపాయలు సినీ నిర్మాతకు రావాలనుకుంటే ధనవంతులు ఒక ఉన్నత స్థాయి వారు సినిమా థియేటర్కు వెళ్లి డబ్బులు పెట్టి చూడరు ఇంట్లోనే చూస్తారు కానీ సామాన్య కష్టపడి పని చేసే సగటు మనుషులు మద్దతురగతి కుటుంబాలు మాత్రమే కాస్త రిలాక్సేషన్ వినోదం కోసం సినిమా థియేటర్కు వెళ్లి చూస్తారు ఇది గమనించిన సినీ నిర్మాతలు సినీ ఇండస్ట్రీ వేలకోట్లు ఆర్థించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో ప్రేక్షకుల నుండి సినిమా టికెట్లు రేట్లు పెంచుకొని లబ్ధి పొందుతున్నారనే విషయాన్ని మనం గమనించాలి. ఏ విధంగా చూసినా సినీ నిర్మాతలు హీరోలు ధనవంతులే కానీ వారికి లాభం చేకూర్చేది సగటు మద్య తరగతి కుటుంబాలే అనే అంశాన్ని వారి మీదే భారం పడుతున్న అంశాన్ని మనం బయటికి ప్రస్తావించవలసిన అవసరం ఉంది ఇది ఒక రకంగా ప్రభుత్వము సినీ ఇండస్ట్రీ సామాన్య మనుసులతో దోపిడీ చేస్తుందని అనక తప్పదు
ఇప్పటికే ప్రజల పైన కరోన తర్వాత నిత్యవసర వస్తువులు ధరలు పెరిగాయి వాటికి తగ్గ వేతనాలు కానీ కూలీలు కానీ పెరగలేదు కావలసినంత ఉద్యోగ ఉపాధి ప్రభుత్వాలు కల్పించడం లేదు పుష్ప 2 సినిమా 2000 కోట్లు ఎలా లాక్కోవాలో ప్రభుత్వంతో సినిమా టికెట్లు పెంచడానికి ఒత్తిడి చేస్తుంది మరో పక్క రేపు జనవరి నెల నుండి 15 వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచబోతున్నారు ఎటు చూసినా ప్రజల పైనే భారం అన్ని భారాలు ప్రజలపైనే ఈ భారం ఎవరు భరించాలి ప్రజలే కదా సినీ ఇండస్ట్రీ బారాలు మాత్రం ప్రజలు భరించాలి వారికి సపోర్టు ప్రభుత్వం మరి సామాన్య ప్రజలకు ప్రభుత్వం సపోర్టు ఏముంది కరోనా తర్వాత ప్రజలకు చాలా కష్టాలు వచ్చాయి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి వాటికి కావాల్సిన బడ్జెట్ కేటాయించడం లేదు ఇది చాలా లోతుగా పరిశీలించాల్సిన వంటి విషయము ప్రతిఘటించాల్సిన విషయము ఇది నా అభిప్రాయం. పి సుంకయ్య రోల్లపాడు గ్రామం